భారత జట్టు ఆగస్టులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ మైదానంలో నిర్వహించనున్నారు.
ఈ రెండు టెస్టు మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. శ్రీలంకలోని స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఈ సిరీస్ జరగనుండటంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పరంగా కూడా ఈ సిరీస్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన భారత్ నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేయగా, ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఫైనల్‌కు టాప్-2 జట్లు మాత్రమే అర్హత సాధించే నేపథ్యంలో శ్రీలంకపై క్లీన్‌స్వీప్ సాధించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.








