E-PAPER

ఇన్‌స్టాగ్రామ్ లవ్ ట్రాప్… పెళ్లి పేరుతో యువతి బంగారం దోచుకున్న క్యాషియర్!

వై 7 న్యూస్ పలాస

విశాఖపట్నం ద్వారకా బస్టాండ్ సమీపంలోని ఒక పార్లర్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులను పరిచయం చేసుకుని మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన గాజు అనిల్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయాలు పెంచుకుని వారికి పెళ్లి చేస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో సోంపేట మండలం జగతికేసుపురం గ్రామానికి చెందిన ఒక యువతితో కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలం ఆమెతో మాట్లాడి ప్రేమ పేరుతో నమ్మకం సంపాదించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. ఈ నేపథ్యంలో 26-02-2026న కాశీబుగ్గలోని KVR లాడ్జ్ వద్ద యువతిని కలుసుకున్న అనిల్ కుమార్, ఆమె వద్ద ఉన్న సుమారు మూడు తులాల బంగారు నగలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
మోసపోయిన యువతి వెంటనే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విశాఖపట్నంలో నిందితుడు గాజు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులను నమ్మి వ్యక్తిగతంగా కలిసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద పరిస్థితులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాశీబుగ్గ టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ ప్రజలకు సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News