E-PAPER

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు

మణుగూరులో కోట్ల అభివృద్ధికి అధికారుల నిర్లక్ష్యం

ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చేలా గుత్తేదారి వ్యవహారం

మణుగూరు;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కోట్లాది రూపాయల నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే, కొంతమంది అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పూల కొట్టు సెంటర్ నుంచి స్నేహ గార్డెన్ వరకు సాంక్షన్ అయిన సీసీ రహదారి ఈ విమర్శలకు నిదర్శనంగా మారింది. సుమారు రూ.1 కోటి 40 లక్షల వ్యయంతో డబుల్ రోడ్డు, సెంటర్ లైటింగ్ సౌకర్యాలతో ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అయితే రహదారి నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండానే సీసీ రోడ్డు వేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. రహదారి ప్రారంభించి చాలా రోజులు గడిచినా ఇప్పటికీ స్తంభాలు రోడ్డు మధ్యలోనే ఉండటం వాటిని అలాగే ఉంచి రోడ్డు వేయడం అంటే ప్రమాదాలకు ఆహ్వానం పలికినట్టేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం రహదారి నిర్మాణానికి ముందే విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్, ఇతర మౌలిక సదుపాయాల సర్దుబాటు పూర్తి చేయాల్సి ఉండగా, సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భవిష్యత్తులో రోడ్డుపై వెళ్లే వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
“అసలు రోడ్డు మధ్యలో స్తంభాలు పీకకుండా రోడ్లు వేయడం ఎలా సాధ్యం?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనులు ఈ విధంగా ఉండటం వల్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు చెడ్డ పేరు తెచ్చేలా గుత్తేదారు వ్యవహరిస్తున్నాడని స్థానికంగా చర్చ జరుగుతోంది.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి, రహదారిని నిబంధనల ప్రకారం పూర్తి చేసి ప్రజలకు సురక్షిత రవాణా కల్పించాలని మణుగూరు ప్రజలు కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!