సూర్యాపేట జిల్లా:
కోదాడకు చెందిన మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి కారణమైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. నర్సింహకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంద కృష్ణ మాదిగ— కర్ల రాజేష్‌ను ఎలాంటి కేసు నమోదుచేయకుండా నాలుగు రోజులపాటు అక్రమంగా అదుపులో పెట్టి పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేయడం అత్యంత ఘోరమైన చర్య అని అభిప్రాయపడ్డారు. రాజేష్ మరణానికి బాధ్యులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డి, కోదాడ రూరల్ సీఐ తదితర సంబంధిత అధికారులపై హత్యాయత్నం, హత్య కేసులు నమోదు చేయడంతో పాటు ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులందరినీ తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు.
సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో రాజేష్ మరణానికి దారితీసిన సంఘటనలన్నింటినీ ఎస్పీకి వివరించారు. వినతిపత్రం స్వీకరించిన ఎస్పీ నర్సింహ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదిగ లాయర్ ఫెడరేషన్ నేతలు రత్నం, జయకర్, మల్లయ్య, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, చింతలపాటి చిన్న శ్రీరాములు, కొండపల్లి ఆంజనేయులు, ఎర్ర వీరస్వామి, ఏపూరి రాజు, ఎలమర్తి రాము, వల్దాస్ జానీ, జిల్లా నాయకులు చింత వినయ్, కోటేష్, నవీన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.









