E-PAPER

కల్లుగీత కార్మికుల హామీలన్నీ వెంటనే అమలు చేయాలి: ఎం.వి. రమణ

సూర్యాపేట:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఇప్పటికీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్‌ను రూ. 2,000 నుండి రూ. 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తుండగా, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే దాన్ని రూ. 10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ మాటను నిలబెట్టుకోలేదని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి కల్లుగీత సొసైటీకీ 5 ఎకరాల భూమి కేటాయించాలని, కల్లులోని ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో వృత్తి కోల్పోయిన గీత కార్మికులకు ఇళ్లు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

రోజు రోజుకు తాటి చెట్లపై నుంచి పడి ప్రాణాలు కోల్పోతున్న గీత కార్మికులను పరామర్శించడానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారెడ్డికి సమయం లేదా అని రమణ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఒక్క స్కీమ్ కూడా ప్రవేశపెట్టలేదని విమర్శించారు. స్వదేశీ అని నినదించే బీజేపీ నాయకులు స్వదేశీ కల్లు, నీరాను ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి చేసేవారందరికీ ‘కాటమయ్య రక్షణ కవచం’ అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్గ్రేషియాలను తక్షణమే చెల్లించాలని, మీరా, తాటి, ఈత ఉత్పత్తులపై ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని సూచించారు. కల్లు గీత కార్పొరేషన్‌కు రూ. 5,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మహాసభల సందర్భంగా ఎం.వి. రమణ రచించిన “మోకు పైలం మోయి గౌడ…” అనే పాటల సీడీని ప్రముఖ కళాకారుడు మానుకోట ప్రసాద్ ఆలపించగా, సుప్రజా హాస్పిటల్స్ ఎండి విజయ్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అలాగే తొట్ల మల్సూర్ గ్రామం చిల్పకుంట్ల నుండి తీసుకువచ్చిన స్మారక జ్యోతిని సభా వేదికపై రమణకు అందజేశారు.

మహాసభల సందర్భంగా వేలాది మంది గీత కార్మికులు బాలాజీ రైస్ మిల్ నుండి మోకు, ముస్తాబులు, తాటి, ఈత కొమ్మలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పుల నాదంతో సూర్యాపేట పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో అసెంబ్లీని ముట్టడించే దిశగా పోరాటం చేపడతామని ఎం.వి. రమణ హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News