భద్రాద్రి కొత్తగూడెం/బూర్గంపాడు: ప్రేమకు బాషతో పనిలేదు.. భావం ఉంటే చాలు. మనసుల కలయికకు మాటలు అవసరం లేదు.. మౌనం చాలు. ఈ మాటలను అక్షరాలా నిజం చేస్తూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. మాటలు రాని, వినిపించని ఓ జంట.. తమ నిశబ్ద ప్రేమతో గెలిచి, పోలీసుల సమక్షంలో ఒక్కటైన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
మౌనమే భాషగా..
జనసంచారం నిండిన పట్టణంలో, చుట్టూ వేల శబ్దాలు వినిపిస్తున్నా.. ఈ ప్రపంచం మాత్రం నిశ్శబ్దం. చిన్ననాటి నుంచి మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ, వారి హృదయాలు మాత్రం ప్రేమ అనే భాష స్పష్టంగా అర్థం చేసుకున్నాయి. గత కొన్నేళ్లుగా ఒకరినొకరు కలుసుకుంటూ, కేవలం సంజ్ఞలతోనే (సంకేత భాష) తమ భావాలను, బాధలను, సంతోషాలను పంచుకుంటూ వచ్చారు. ఈ నిశ్శబ్ద ప్రయాణంలో వారి ప్రేమ మరింత బలపడింది.
ఖాకీల సమక్షంలో.. కళ్యాణ ఘట్టం
పెళ్లి ద్వారా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంటకు, పెద్దల అంగీకారం మరియు కొన్ని అనివార్య కారణాల రీత్యా బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంది. వచ్చింది. అయితే, అక్కడ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారికా కాకుండా, మనసున్న మారాజులుగా వ్యవహరించారు.
స్టేషన్ ఆవరణలోనే ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారి ప్రేమలోని గాఢతను పెద్దలకు అర్థమయ్యేలా చెప్పారు. చివరకు కుటుంబ సభ్యుల అంగీకారంతో, పోలీస్ స్టేషను కళ్యాణ వేదికగా మారింది. పోలీసులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ జంట దండాలు మార్చుకున్నారు.
మాటలకతీతమైన బంధం
“శారీరకంగా వారు మాట్లాడలేకపోయినా, వినలేకపోయినా – వారి హృదయాలు మాత్రం మాటలకతీతంగా కలిశాయి.”
వధూవరులు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, సైగలతోనే తమ ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం చూసి అక్కడున్న వారి గుండె బరువెక్కింది. ఏ బాజాలు, భజంత్రీలు లేకపోయినా.. ఆ జంట ముఖాల్లో కనిపించిన చిరునవ్వులు ఆ పెళ్లికి నిండుదనాన్ని తెచ్చాయి.
ఒక స్ఫూర్తి
శారీరక లోపాలు ప్రేమకు అడ్డుకావని, మనసుంటే మార్గం ఉందని ఈ జంట నిరూపించింది. బూర్గంపాడు పోలీసులు చేసిన ఈ మంచి పనిని స్థానికులు, జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఈ మూగ ప్రేమకథ.. నేటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి.









