ఆదివాసి సంఘాలు
భద్రాచలం, నవంబర్ 25:
తెలంగాణలో చట్టబద్ధత లేని లంబాడీలను ST జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాలు తమ దీర్ఘకాలిక ధర్మయుద్ధాన్ని మరింత దృఢంగా కొనసాగిస్తామని రాష్ట్ర ఆదివాసి సంస్థల కార్యచరణ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ ప్రకటించారు.
భద్రాచలం హరిత టూరిజం హోటల్‌లో మంగళవారం జరిగిన అన్ని ఆదివాసి సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రసంగించిన నేతలు—
లంబాడీలు గత 49 సంవత్సరాలుగా అనధికారికంగా ST రిజర్వేషన్లను వినియోగించుకుంటున్నారని, దీనివల్ల ఆదివాసుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాలు, రాజకీయ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న నేపథ్యంలో ఇక ఆగకుండా పోరాటాలు విస్తృతం చేయాలని తేల్చారు.
సమావేశంలో ఆమోదించిన కీలక తీర్మానాలు:
1. డిసెంబర్ 29, 2025 – భద్రాచలం ITDA ముట్టడి
2. జనవరి 4, 2026 – చలో మేడారం కార్యక్రమం
3. జనవరి 12, 2026 – చలో నల్లమల, ITDA మన్ననూరు ముట్టడి
4. జనవరి 19, 2026 – ఉట్నూరు ITDA ముట్టడి
5. ఫిబ్రవరి 5–మార్చి 10, 2026 – చలో జిల్లా కలెక్టరేట్ ముట్టడులు
6. ఫిబ్రవరి 9 – మహబూబాబాద్, ఫిబ్రవరి 18 – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23 – ములుగు, మార్చి 2 – ఆదిలాబాద్, మార్చి 9 – ఆసిఫాబాద్ జిల్లాకలెక్టరేట్ ముట్టడులు
7. అనంతరం రాష్ట్రస్థాయిలో చలో రాజభవన్ కార్యక్రమం నిర్వహణ ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుండు శరత్, పాయం సత్యనారాయణ (GSP), ఉయిక రవి (ఆదివాసి సేన), ఐర్సా నర్సింహమూర్తి (నవనిర్మాణసేన), పూనెం రాంచందర్, వాసం రామకృష్ణ, పూనెం కృష్ణ, వాసం నాగరాజు, పూనెం వరప్రసాద్, రమణాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.









