E-PAPER

హైదరాబాద్‌లో హత్య… సూర్యాపేటలో శవం క్లూస్‌తో కేసును ఛేదించిన రూరల్ పోలీసులు

సూర్యాపేట

సూర్యాపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన కేసును జిల్లా పోలీసులు వేగంగా ఛేదించారు. సాంకేతిక ఆధారాలు, ఫింగర్ ప్రింట్ డేటాబేస్, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసినట్టు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలిపారు.

ఈ నెల 15వ తేదీన టేకుమట్ల–ఖమ్మం జాతీయ రహదారి వద్ద పిల్లలమర్రి గ్రామ శివారులో సంచిలో కట్టి చిన్న కాలువలో పడేసిన 50 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనిపించడంతో రూరల్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. శవంపై యాసిడ్ పోసి ఆనవాళ్లు చెరిపేందుకు చేసిన ప్రయత్నం పోలీసులు గమనించారు. వెంటనే జిల్లా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు.

తరువాత ఫింగర్ ప్రింట్ డేటాబేస్‌తో పోల్చినప్పుడు మృతుడు గతంలో నేరచరిత్ర కలిగిన నాగవరపు సత్యనారాయణ @ సత్తిబాబు (అమలాపురం, ఏపీ) అని గుర్తించారు. ఈయన 2023లో హైదరాబాద్ బోయినపల్లి పరిధిలో భార్యను హత్య చేసిన కేసులో విచారణ ఖైదీగా ఉండి, ఈ నెల 6న బెయిల్‌పై విడుదలైనట్టు పోలీసులు తెలిపారు.

బెయిల్‌పై వచ్చాక సత్యనారాయణ కోర్టుకు హాజరయ్యే తేదీలను అతని బావమరిది గెల్లా కిరణ్ (A1) మరియు వారి బంధువులు గమనించి, సత్యనారాయణ బ్రతికి ఉన్నంత కాలం తమకు ప్రమాదం ఉంటుందని భావించి హత్యకు పూనుకున్నట్టు దర్యాప్తులో తేలినది. నవంబర్ 14న సికింద్రాబాద్ కోర్ట్ వద్ద సత్యనారాయణ బయటకు వచ్చిన సమయంలో కిరణ్, సంబంధీకులు వాహనాల్లో వెంబడించి అతన్ని బలవంతంగా కారులో ఎక్కించారు. అనంతరం కారులో గొంతుపై కాలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసి హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

హత్య అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో యాసిడ్ పోసి, లాష్‌ను సూర్యాపేట రూరల్ పోలీస్ పరిధిలోని పిల్లలమర్రి శివారులో పడేసి, అక్కడ్నుంచి విజయవాడ వెళ్లినట్టు విచారణలో బయట పడింది.

నవంబర్ 19న సాయంత్రం నిందితులంతా జీడిమెట్లలోని నేతల సర్వేశ్వరరావు ఇంట్లో తలదాచుకున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన ఎర్టిగా కారు, కియా కారు, తాళ్లు, క్లాత్, యాసిడ్ క్యాన్, 10 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 9 మంది అరెస్టయ్యారు. వీరందరూ ఏపీ కోనసీమ జిల్లాకు చెందిన బంధువులేనని, గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేనట్టు ఎస్పీ తెలిపారు. మృతుడి మీద మాత్రం హైదరాబాద్ బోయినపల్లి స్టేషన్‌లో ఒక హత్య కేసు, అమలాపురం స్టేషన్‌లో నాలుగు దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసు చేదనలో కీలకపాత్ర పోషించిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్సై బాలు నాయక్, పెనపహాడ్ ఎస్సై గోపీ కృష్ణ, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్‌ను ఎస్పీ నరసింహ ఐపీఎస్ అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!