సూర్యాపేట, నవంబర్ 19 ;
ఈ నెల 28న సూర్యాపేట పట్టణంలో జరగనున్న కల్లుగీత కార్మికుల రణభేరి సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చాలని కల్లు గీత కార్మిక సంఘం (KGKS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను పోరాటాల పుట్టుగడ్డగా పేరుగాంచిన సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా సూర్యాపేట ప్రజాసంఘాల భవనంలో జిల్లా కమిటీ సమావేశం ఎలుగూరి గోవిందు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో మాట్లాడుతూ వెంకటేశ్వర్లు, 1957లో రాష్ట్రంలో మొదటగా ఏర్పడిన కల్లుగీత కార్మిక సంఘం 68 ఏళ్ల సుదీర్ఘ పోరాట చరిత్రను గుర్తుచేశారు. ఈ కాలంలో సొసైటీలు, TFTలు, పెన్షన్, ఎక్సిగ్రేషియా వంటి అనేక హక్కులను దీర్ఘకాల పోరాటాలతో సాధించుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడిన కల్లు–గీత వృత్తి పట్ల ప్రభుత్వానికి పెద్దగా పట్టింపు లేకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలలో ఒక్కటికీ అమలు జరగలేదని, అధికారుల్ని, మంత్రుల్ని పలుమార్లు కలిసినా ఎటువంటి స్పందన రాలేదని తెలిపారు.
వారి ప్రధాన డిమాండ్లు:
పెన్షన్‌ను ₹4,000కి పెంచాలి
ఎక్సిగ్రేషియాను ₹10 లక్షలకు పెంచాలి
కాటు ప్రమాదాల నివారణ కోసం “కాటమయ్య రక్షణ కవచం” అందరికీ ఇవ్వాలి
పెండింగ్‌లో ఉన్న ఎక్సిగ్రేషియా మొత్తాలను వెంటనే విడుదల చేయాలి
నీరా & తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
ఈ డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకు రాష్ట్ర మహాసభలు కీలక వేదికవుతాయని వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మహాసభలు విజయవంతం అయ్యేలా అందరూ ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని బిక్షం, గుణగంటి కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శులు ఉయ్యాల నగేష్, బత్తుల జనార్ధన్, జేరిపోతుల కృష్ణ తదితరులతో పాటు అనేక జిల్లా నేతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు









