చర్ల మండలం – ఉప్పరగూడెం గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ సెక్టార్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండా చరణ్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. చర్ల మండల ప్రజలను సంవత్సరాల తరబడి మోసం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ పార్టీలను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీలు ఇవేనని, వాటి పాలనలో చర్ల మండల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఎన్నికల హామీలను నెరవేర్చలేదని చరణ్ వ్యాఖ్యానించారు. పది సంవత్సరాలపాటు పాలించిన బిఆర్ఎస్ ఇప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించమంటూ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. చర్ల మండలం పట్ల ఈ రెండు పార్టీలకు అసలు ప్రేమా చిత్తశుద్ధి లేదని, ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మాణం ఇంకా పూర్తి కానివ్వడం, వద్దపేటలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కాకపోవడం, కోరేగడ్డ నిర్వాసితులకు నష్టపరిహారం అందకపోవడం, వరద బాధితులకు ఐదు సెంట్ల ఇంటిస్థలాల పంపిణీ జరగకపోవడం, ఈతవాగు బ్రిడ్జి సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్–బిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను అద్దం పట్టారు. ఎన్నిసార్లు అధికారం మార్చుకున్నా ప్రజల నిత్యజీవిత సమస్యలు మాత్రం ఎప్పుడూ మారలేదని చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఈ రెండు పార్టీల కుటిల రాజకీయాలను గుర్తించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్‌కు గట్టి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. చర్ల మండల అభివృద్ధి సాధ్యమయ్యేది బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే అని, సమానత్వం మరియు బహుజన జాతుల పురోగతికి కట్టుబడి పని చేస్తున్న బీఎస్పీకే ప్రజలు అవకాశమివ్వాలని కోరారు.
ఈ సమావేశంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు చెన్నం మోహన్, సెక్టార్ నాయకులు SK జహీరుద్దీన్ భాషా, అన్నపూర్ణ, నర్సయ్య, త్రిమూర్తులు, రాజు తదితరులు పాల్గొన్నారు.









