బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి డిమాండ్
తడిసిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి
అశ్వాపురం
మంథా తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని, ఎకరానికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బీఆర్‌ఎస్ అశ్వాపురం మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట చేలను పరిశీలించారు. అనంతరం బీఆర్‌ఎస్ మండల కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఎన్నో ఆశలతో సాగు చేసిన పత్తి రైతులు అకాల వర్షాలతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉన్నారు. అప్పులు తెచ్చి విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు చేసి కష్టపడ్డ రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అని అన్నారు.
పంట చేతికొచ్చే దశలో వర్షాల బీభత్సానికి గురై పూతలు, పిందెలు, కాయలు రాలిపోవడంతో రైతుల కష్టాలు నీటిలో కలిసిపోయాయని చెప్పారు. భూసారాన్ని బట్టి ఎకరానికి 10–12 క్వింటాళ్లు దిగుబడి ఇచ్చే పత్తి ఇప్పుడు మూడు,నాలుగు క్వింటాళ్లు కూడా ఇవ్వని పరిస్థితి. తేమతో పత్తి చేలు తెగుళ్లకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకొని తక్షణ నష్టపరిహారం ప్రకటించడంతోపాటు, తడిసిన పత్తిని తేమ శాతం పేరుతో తిరస్కరించకుండా సిసిఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ తరఫున రైతులను ఏకం చేసి ఆందోళనలు చేపడతాం అని హెచ్చరించారు.
#పులిపాటి పాపారావు | జర్నలిస్ట్









