E-PAPER

గుత్తేదారు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి

వై7న్యూస్ ను ఆశ్రయిస్తున్న బాధితులు

పదుల సంఖ్యలో బాధితులు

అధికారుల అండతో గుత్తేదారు అరాచక రాజ్యం!

గుత్తేదారు వెనకాల ఉన్న అధికారులు ఎవరు?

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 06 వై 7 న్యూస్ తెలుగు

అశ్వాపురం మండలంలో టీజీఎన్‌పిడిసిఎల్‌కు చెందిన ఓ గుత్తేదారు చేసిన మోసాలపై వై 7 న్యూస్‌లో వరుసగా వెలువడుతున్న కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్కరితో మొదలైన ఈ కథనం ఇప్పుడు పదుల సంఖ్యలో బాధితులను వెలికితీస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మంది బాధితులు ప్రత్యక్షంగా వై 7 న్యూస్‌ను ఆశ్రయించి తమ వేదన వినిపించారు.

ఈ గుత్తేదారు నిర్వాకం ప్రభుత్వ రంగ విద్యుత్తు సంస్థకు తీవ్రమైన అపఖ్యాతిని తెచ్చిపెడుతోంది. ఇటీవల అశ్వాపురం మండలం జగ్గారం గ్రామానికి చెందిన ఓ రైతు ఎదుర్కొన్న అన్యాయంపై వై 7 న్యూస్ కథనం ప్రచురించిన సంగతి విదితమే. ఆ కథనం విద్యుత్ శాఖలో రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. ఈ కథనంపై స్పందించిన టీజీఎన్‌పిడిసిఎల్ సీఎండీ, స్పెషల్ విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు జిల్లా అధికారులు వెల్లడించారు.

విజిలెన్స్ అధికారులు ఖమ్మం నుంచి వచ్చి బాధిత రైతును కలసి వివరాలు నమోదు చేయగా, బాధితుడు ఖమ్మం విజిలెన్స్ ఆఫీసుకెళ్లి తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ అంశంపై వై 7 న్యూస్ విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించగా, ప్రస్తుతం విచారణ నడుస్తోందని, పూర్తి వివరాలు సీఎండి మాత్రమే వెల్లడించగలరని వారు పేర్కొన్నారు.

కాంట్రాక్టర్‌కు ఉన్న డివిజన్ అధికారి అండదండలు..?

ఈ గుత్తేదారు వెనుక ఓ భద్రాచలం డివిజన్ స్థాయి అధికారి సహా మరొక ఇద్దరు ఉన్నారు అనే సమాచారం . అతడిపై విచారణ పటిష్టంగా జరిగితే, వారు తీసుకున్న ముడుపుల వ్యవహారాలు కూడా బహిరంగమవుతాయనే భయం కారణంగా అతడికి అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తాజాగా, జగ్గారం గ్రామానికి చెందిన రాణి అనే మహిళ మోసపోయిన విషయాన్ని వై 7 న్యూస్ కు వివరించారు. గుత్తేదారు ఆమె వద్ద రూ.15,000 తీసుకున్నప్పటికీ, రెండేళ్లుగా ఏ పనీ చేయలేదు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నాడని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు న్యాయం చేయండి” అంటూ ఆమె వేడుకుంటున్నారు.

ప్రభుత్వానికి చెడు పేరు తెస్తున్న ఈ గుత్తేదారు వలన, ప్రజా సంక్షేమ పథకాలు అపహాస్యానికి గురవుతున్నాయి

“రైతే రాజు” అని నినదించే రాష్ట్రంలో, ఇటువంటి మోసగాళ్ల వల్ల ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో నమ్మకం తగ్గుతుంది. ఈ గుత్తేదారు లైసెన్స్‌ను బ్లాక్ లిస్టులో చేర్చాలని, అతను చేసిన పనులకు బిల్లులు ఆపి బాధితులకు న్యాయం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వై 7 న్యూస్, బాధితుల వివరాలు ఆధారంగా పూర్తి అధ్యయనం చేసి, గుత్తేదారు చేసిన మోసాలపై నేరుగా టీజీఎన్‌పిడిసిఎల్ సీఎండి కి ఆధారాలతో వివరణ కోరనుంది. త్వరలోనే బాధితుల వీడియోలను వరుసగా విడుదల చేయనున్నాం.

అతడిని ఎవరూ ఏం చేయలేరా? అధికారుల అండతో మరో లైసెన్స్ తీసుకుని మళ్లీ పనులు చేస్తానంటున్న గుత్తేదారు!

ఇంతవరకు వెలువడిన కథనాలు అతనికి “చీమ కుట్టినట్లూ” అనిపించలేదని తెలుస్తోంది. “ఈ లైసెన్స్ పోయినా వేరే లైసెన్స్ తీసుకుంటా… నాకు అధికారుల అండ ఉంది… అవసరమైతే విలేకరులతో సెటిల్‌మెంట్ చేసుకుంటా” అనే మాటలు అతను బయట చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే, ఇది పత్రికా స్వేచ్ఛపైనే ప్రమాదం, ప్రజాస్వామ్య విధానాలపై ఉక్కుపాదం.

ఇంకా ఎన్ని మోసాలు బయటపడనున్నాయి? ఎవరు నిజంగా బాధితులకు న్యాయం చేస్తారు?
వై 7 న్యూస్ ఈ వ్యవహారంపై మళ్లీ మరిన్ని వివరాలతో ప్రత్యేక కథనాలను త్వరలోనే విడుదల చేయనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :