మణుగూరు మే 07 :
వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయని ఎంపీడీఓ తేళ్ళూరి శ్రీనివాసరావు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఎంపీడీఓ శ్రీనివాసరావు గడ్డపార చేతపట్టి తన సిబ్బందితో కలిసి నీరు నిల్వలు ఉండే ప్రాంతంలో మూడు అడుగుల మేర ఇంకుడు గుంత తవ్వెందుకు కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయాలని ప్రభుత్వం సంకల్పించిదన్నారు. ప్రధానంగా పల్లపు ప్రాంతం, బోరు బావి, చేతి పంపుల సమీపంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తే నీరు భూమిలోకి ఇంకి వేసవికాలంలో కూడా నీటి కొరత లేకుండా ఉంటుందని తెలిపారు. ఈ ఇంకుడు గుంతలు నేల స్వభావాన్ని బట్టి, పరిసరాలను బట్టి, నీటి లభ్యతను బట్టీ గుంతల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలని తెలియజేశారు.









