E-PAPER

త్రివర్ణ పతాకం మార్కర్‌ను చేతుల్లోకి తీసుకుని జేబులో పెట్టుకున్న మోదీ..! వీడియో సోషల్ మీడియాలో వైరల్..

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన క్వాడ్ (Quad) దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకం పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని మరోసారి చాటుకున్నారు. సదస్సులో భాగంగా క్వాడ్ దేశాధినేతల ఉమ్మడి ఫోటో సెషన్ (ఫోటో-ఆప్) జరగడానికి కొద్ది సెకన్ల ముందు ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

వేదికపై నేతలు నిలబడాల్సిన స్థానాన్ని సూచించేందుకు నేలపై ఉంచిన భారత త్రివర్ణ పతాకం గుర్తు (ఫ్లోర్ మార్కర్)ను ప్రధాని మోదీ గమనించారు. వెంటనే ఆయన కిందకు వంగి, ఆ త్రివర్ణ మార్కర్‌ను ఎంతో గౌరవంగా చేతుల్లోకి తీసుకుని తన కోటు జేబులో భద్రపరుచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనాయ్ తకైచి, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. వారంతా మోదీ చేసిన పనిని ఆసక్తిగా తిలకించారు. పక్కనే ఉన్న ట్రంప్.. మోదీ భుజం తట్టారు. కొద్ది సెకన్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

జాతీయ జెండా ప్రజల ఆత్మగౌరవానికి, దేశ సమైక్యతకు ప్రతీక అని ప్రధాని మోదీ గతంలో పలుమార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆయన ప్రారంభించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా జాతీయ జెండాతో పౌరులకు వ్యక్తిగత అనుబంధాన్ని, దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ వేదికపై కూడా ఆయన జెండా పట్ల చూపిన ఈ మర్యాద అందరినీ ఆకట్టుకుంది.

అంతకుముందు జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. భారత్‌కు క్వాడ్ కూటమి అత్యంత నిర్మాణాత్మకమైన, విశ్వసనీయమైన భాగస్వామ్యమని ఆయన స్పష్టం చేశారు. మనీలా నగరానికి, క్వాడ్ కూటమికి చారిత్రక సంబంధం ఉందని గుర్తుచేస్తూ.. “2007లో నాలుగు దేశాల అధికారులు తొలిసారి ఈ మనీలా నగరంలోనే సమావేశమయ్యారు. ఆ తర్వాత 10 సంవత్సరాలకు, 2017లో మళ్లీ ఇక్కడే మన చర్చలు పునఃప్రారంభమయ్యాయి. నేడు మళ్లీ ఇదే చారిత్రక నగరంలో క్వాడ్ సదస్సు జరగడం ఒక ముఖ్యమైన మైలురాయి” అని పేర్కొన్నారు. సముద్ర భద్రత, సురక్షిత సరఫరా గొలుసులు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, విపత్తు స్పందన వంటి అనేక కీలక రంగాల్లో క్వాడ్ కూటమి విశ్వసనీయ పరిష్కారాలు చూపుతోందని తెలిపారు.

ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీని “వెరీ టఫ్ మ్యాన్” (చాలా గట్టి మనిషి) అంటూ కొనియాడారు. “నిజానికి ఆయన చాలా గట్టి వ్యక్తి. ఇక జపాన్ ప్రధాని తకైచి ఆయన కంటే ఇంకా గట్టివారేమో! ఇక మేము (తాను, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్) కూడా ఫర్వాలేదు, బాగానే ఉన్నాం” అంటూ ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన ఈ క్వాడ్ కూటమి, ట్రంప్ ప్రస్తుత పదవీకాలంలో మొదటిసారిగా పూర్తిస్థాయిలో సమావేశం కావడం విశేషం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!