E-PAPER

ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన ధోనీ..! ఇక నుండి సీఎస్‌కే మెంటార్‌గా..

క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుత శకం ముగిసింది. భారత మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా మైదానాన్ని వీడినప్పటికీ, సీఎస్‌కేతో అతడి అనుబంధం కొనసాగనుంది. ఐపీఎల్ 2027 సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ‘టీమ్ మెంటార్‌’గా సరికొత్త బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

ధోనీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఎలా తెలియజేశాడో సీఎస్‌కే యజమాని రూపా గురునాథ్ ఒక ప్రత్యేక వీడియో ద్వారా పంచుకున్నారు. వచ్చే సీజన్ కోసం ఆటగాళ్ల విడుదల (రిలీజెస్), వ్యూహాలపై శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఎస్‌కే ఎండీ కాశీ విశ్వనాథన్ విడుదల చేయాల్సిన ఆటగాళ్ల జాబితాను చదువుతుండగా, ధోనీ చాలా నిశ్శబ్దంగా స్పందిస్తూ.. “బహుశా ఆ జాబితాలో నా పేరు కూడా చేరిస్తే మంచిదేమో” అని అన్నాడని రూపా గురునాథ్ వెల్లడించారు. ఆ మాట విన్న వెంటనే తామంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యామని, జట్టుకు 200 శాతం న్యాయం చేయలేనప్పుడు మైదానంలో కొనసాగడం ధోనీ నైజం కాదని ఆమె పేర్కొన్నారు. ఇకపై ధోనీ మెరుపు స్టంపింగ్స్, హెలికాప్టర్ షాట్లు మైదానంలో కనిపించవనే నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని, అయితే కొత్త తరం ఆటగాళ్లకు మార్గదర్శనం చేసేందుకు మెంటార్‌గా ఆయన రాకను స్వాగతిస్తున్నామని చెప్పారు.

సీఎస్‌కే అధినేత ఎన్ శ్రీనివాసన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ధోనీ గొప్పతనాన్ని కొనియాడారు. “ధోనీ లేని సీఎస్‌కేను ఊహించలేము. దాదాపు రెండు దశాబ్దాలుగా మేము కలిసి ఎదిగాం. 2008 ఐపీఎల్ వేలంలో ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేయడమే మా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం. ట్రోఫీల కోసం మాత్రమే కాదు, అతడి వ్యక్తిత్వం పరంగా చూసినా ఆ నిర్ణయం చాలా గొప్పది. చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పటికీ అతడి సొంత ఇల్లే” అని శ్రీనివాసన్ స్పష్టం చేశారు.

సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్ సైతం ధోనీ సేవలను గుర్తు చేసుకున్నారు. చెన్నై నగరంతో, అభిమానులతో ధోనీ విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్నాడని తెలిపారు. ట్రోఫీలు గెలవడమే కాకుండా, వాటిని గెలిచిన విధానమే ధోనీ వారసత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టిందని, మెంటార్‌గా  అతడు ఇచ్చే సలహాలు భవిష్యత్ తరానికి ఎంతో విలువైనవని పేర్కొన్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ, సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టడంతో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను అందించాడు. చెన్నై తరఫున అత్యధికంగా 272 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 5,314 పరుగులతో జట్టులో రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఉత్కంఠ సమయాల్లో ప్రశాంతంగా మ్యాచ్‌లను ముగించడం, అనూహ్య ఫీల్డింగ్ మార్పులతో ఫలితాలను మార్చేయడం అతడి ప్రత్యేకత. ఇప్పుడు ఆటగాడి పాత్ర నుంచి గురువు పాత్రలోకి అడుగుపెడుతున్న ధోనీ సరికొత్త ఇన్నింగ్స్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!