E-PAPER

దేశవ్యాప్తంగా 2029 నాటికి డ్రగ్ ఫ్రీ..! అమిత్ షా కీలక ప్రకటన..!

2028 డిసెంబర్ 31 నాటికి గుజరాత్‌ను పూర్తిగా మాదకద్రవ్యాల రహిత (డ్రగ్ ఫ్రీ) రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ సాధనకు 2029 డిసెంబర్ 31ని గడువుగా నిర్ణయించామని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ, తానూ గుజరాత్‌కు చెందిన వారం కావడంతో రాష్ట్రం ఏడాది ముందే ఈ లక్ష్యాన్ని అందుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులను అమిత్ షా ప్రారంభించారు. వీటిలో ఇస్కాన్-సనంద్ ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు పలు గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చిన తర్వాత తదుపరి ప్రధాన లక్ష్యం డ్రగ్స్ రహిత భారత్‌ను నిర్మించడమేనని అన్నారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం డిసెంబర్ 1 నుంచి ‘1033’ టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగంపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని, వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే నిధులు ఉగ్రవాద కార్యకలాపాలకు చేరుతున్నాయని హెచ్చరించారు.

డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అమిత్ షా పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనను ఉపాధ్యాయులు నిశితంగా గమనించాలని సూచించారు. బాధితులకు చికిత్స అందించేందుకు డీ-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వారి వివరాలు కూడా బయటకు రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!