అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలన్న రాజ్యాంగ నిబంధనపై సుప్రీంకోర్టు కీలక వివరణ ఇచ్చింది. పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచి కాకుండా.. వాస్తవంగా నిర్బంధించిన క్షణం నుంచే లెక్కించాలని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించి అదుపులోకి తీసుకున్న సమయమే ఈ గడువుకు ప్రాతిపదిక అని తేల్చిచెప్పింది.
త్రిపురలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులో బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) ప్రకారం అరెస్టయిన వ్యక్తిని ప్రయాణానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా సమీప మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అంతకుమించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు.
సోదాలు, స్వాధీనం ప్రక్రియ పూర్తయ్యాక పోలీసులు అధికారికంగా అరెస్టు నమోదు చేసినప్పటి నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని భావించడం చట్టవిరుద్ధమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాస్తవంగా నిర్బంధించిన సమయం నుంచి 24 గంటలు దాటినా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకపోతే సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ గడువును లెక్కించేటప్పుడు అరెస్టు చేసిన ప్రాంతం నుంచి మేజిస్ట్రేట్ కోర్టుకు చేరుకోవడానికి పట్టే ప్రయాణ సమయాన్ని మాత్రమే మినహాయించాలని స్పష్టం చేసింది.
అంతేకాదు, 24 గంటల్లోగా కోర్టు ఎదుట హాజరుపరిచినంత మాత్రాన నిర్బంధం చట్టబద్ధమైనట్లు కాదని ధర్మాసనం తెలిపింది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 58 ప్రకారం.. కేసు పరిస్థితులకు అనుగుణంగా నిర్బంధ సమయం సహేతుకంగా ఉండేలా దర్యాప్తు సంస్థలు చూసుకోవాలని పేర్కొంది.
నిందితుడిని తమ ఎదుట హాజరుపరిచినప్పుడు అతడి స్వేచ్ఛకు భంగం కలిగించిన అసలు తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్యాంగం నిర్దేశించిన 24 గంటల గడువు పాటించారా? లేదా? అన్నది స్వతంత్రంగా పరిశీలించాలని సూచించింది. నిర్బంధం సహేతుకమైన సమయాన్ని మించిందని భావిస్తే తదుపరి రిమాండ్‌కు అనుమతి నిరాకరించే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.








