ప్రధాని నరేంద్ర మోదీతో చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసరడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. వీధుల్లో కాకుండా పార్లమెంటులో చర్చకు రావాలని సూచించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
హర్యానాలోని కర్నాల్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో చర్చ కావాలంటే ఆయనకు లేఖ రాయాలని రాహుల్‌కు సూచించారు. ఎస్‌ఐఆర్‌పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని, పార్లమెంటుకు వచ్చి తన వాదనలు వినిపించాలని సవాల్ విసిరారు.
దేశ వ్యతిరేకులు ఎవరు? విదేశీ శక్తులతో సంబంధాలు ఎవరికి ఉన్నాయి? ఆ సంబంధాల స్వరూపం ఏంటి? అనే అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ రాహుల్ గాంధీ నవంబర్ 3న మరోసారి సవాల్ విసిరారు. ఎక్కడైనా, ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని ఎక్స్‌లో పోస్టు చేశారు. మీడియా, దేశ యువత సమక్షంలో ఈ చర్చ జరగాలని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకించడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎస్‌ఐఆర్ జరగలేదని, అయినా కాంగ్రెస్ ఓటమి పాలైందని వ్యాఖ్యానించారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎస్‌ఐఆర్ లేదని, అయినప్పటికీ కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదని అన్నారు. పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా.. బయట సభలు, ఆందోళనలతో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
వీధుల్లో జనాన్ని సమీకరించి ఆందోళనలు కొనసాగిస్తే బీజేపీ కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారని షా హెచ్చరించారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీని, కాంగ్రెస్‌ను పదేపదే తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో నిర్వహించిన సభకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని పిలిచామని కాంగ్రెస్ చెప్పిందని, అయితే సభా ప్రాంగణం సామర్థ్యం 70 వేల మందేనని, అందులోనూ సగం ఖాళీగా ఉందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల వివరాలను కూడా ప్రజలకు వెల్లడించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ఆ వివరాలు తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉందని వ్యాఖ్యానించారు.








