E-PAPER

రోహిత్ శర్మ ‘జెర్సీ నెంబర్ 45’ వెనుక కథ ఇదే..!

టీమిండియా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ తన ఐకానిక్ జెర్సీ నెంబర్ 45 వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను అభిమానులతో పంచుకున్నాడు. తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ అనే గేమింగ్ రియాలిటీ షోలో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ జెర్సీ నెంబర్‌ను ఎంచుకోవడం వెనుక తన తల్లి పాత్ర కీలకమని రోహిత్ తెలిపాడు.

ఈ షోలో నటుడు రాహుల్ లోహాని.. “సర్, 45 నెంబర్ జెర్సీ చూడగానే హిట్ మ్యాన్ వచ్చాడని అందరికీ అర్థమవుతుంది. కానీ మీరు ఈ నెంబర్‌నే ఎందుకు ఎంచుకున్నారు?” అని ప్రశ్నించారు. దీనికి రోహిత్ బదులిస్తూ, తొలినాళ్లలో అండర్-19 ఆడుతున్నప్పుడు తనకు 19వ నెంబర్ జెర్సీ కేటాయించారని చెప్పాడు. ఆ నెంబర్ అంటే ఇష్టంతోనే ఆడానని, కానీ ఆ తర్వాత సీనియర్ జట్టులోకి వస్తే ఆ నెంబర్‌ను కొనసాగించలేవని ఒకరు చెప్పారని గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ 19వ నెంబర్ జెర్సీతో ఆడేవారని, అందుకే ఆ నెంబర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు.

“ఆ నెంబర్‌తో ఆడలేనని తెలియగానే, వెంటనే హోటల్‌కు వెళ్లి మా అమ్మకు ఫోన్ చేశాను. ఏ నెంబర్ తీసుకోవాలో చెప్పమని అడిగాను. అప్పుడు అమ్మ ‘న్యూమరాలజీ ప్రకారం 9 వచ్చేలా చూసుకో, నీకు మంచిది’ అని సలహా ఇచ్చింది” అని రోహిత్ తెలిపాడు. అయితే 9వ నెంబర్ అప్పటికే వేరొకరు తీసుకున్నారని, 27 (2+7=9) తీసుకోవడం ఇష్టం లేదని చెప్పాడు. “అదే సమయంలో 4, 5 అంకెలు పక్కపక్కన ఉంటే బాగుంటుందనిపించింది. ఈ విషయాన్ని అమ్మకు చెప్పి, 4+5 కలిపితే 9 వస్తుంది కదా అని ఒప్పించాను. అలా ’45’ నెంబర్‌ను ఎంచుకున్నాను” అంటూ తన జెర్సీ వెనుక ఉన్న కథను రోహిత్ వివరించాడు.

కాగా, ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారం అవుతుండగా, సోనీ లివ్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!