E-PAPER

మనుషులను వణికిస్తున్న ‘షమోండా వైరస్’..! అసలేంటీ వింత వ్యాధి..?

ఫ్రాన్స్‌లో మొట్టమొదటి సారిగా ఒక మనిషిలో ‘షమోండా వైరస్’ (Shamonda virus) ఆనవాళ్లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. ఈ వ్యాధి బారిన పడిన 60 ఏళ్ల వయసున్న వ్యక్తి, అనారోగ్య సమస్యలతో పాటు ఇమ్యూనిటీ తక్కువగా ఉండటంతో (immunocompromised) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం జంతువులలో మాత్రమే కనిపిస్తూ వచ్చిన ఈ వైరస్.. ఇప్పుడు మనుషులకు సోకడం వైద్య నిపుణులలో చర్చనీయాంశమైంది.

షమోండా వైరస్ అనేది ‘ఆర్థోబన్యావైరస్’ (Orthobunyavirus) కుటుంబానికి చెందిన ఒక రకమైన వైరస్. దీనిని మొట్టమొదట 1960ల మధ్యకాలంలో నైజీరియా దేశంలో పశువులలో గుర్తించారు. అప్పటి నుంచి ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఇది అడపాదడపా జంతువులలో వెలుగు చూస్తూనే ఉంది. ఇది ప్రముఖ ‘శ్మాల్‌బర్గ్‌ వైరస్’ (Schmallenberg virus) కుటుంబానికే చెందింది. ఈ వైరస్ ప్రధానంగా ఆవులు, గొర్రెలు, మేకలు, గుర్రాలు, అల్పాకాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.

ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) వివరాల ప్రకారం.. జంతువులకు ఈ వైరస్ సోకితే కొన్ని రకాల లక్షణాలు కనిపించనున్నాయి. జ్వరం, విరేచనాలు, ఆహారం తీసుకోలేకపోవడం, పాలు ఇచ్చే సామర్థ్యం తగ్గడం, ప్రత్యుత్పత్తి సమస్యలు, గర్భస్రావాలు (abortions), కడుపులోనే చనిపోవడం, పుట్టే పిల్లలలో తీవ్రమైన అసాధారణ శరీర ఆకారాలు ఏర్పడటం వంటి సమస్యలతో బాధపడనున్నారు.

మనుషులకు ఎలా సోకుతుంది?

ఈ వైరస్ ప్రధానంగా ‘మిడ్జెజ్’ (Culicoides midges – చిన్న ఈగ లాంటి కీటకాలు) ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ కీటకాలు.. వైరస్ సోకిన జంతువులను కుట్టిన తర్వాత ఆరోగ్యకరమైన జీవులను లేదా మనుషులను కుట్టడం ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకూ లేదు. వైరస్ సోకిన పశువులను తాకడం వల్ల లేదా వాటి దగ్గరగా ఉండటం వల్ల కూడా ఈ వైరస్ మనుషులకు రాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మరణించిన వ్యక్తికి వైరస్ ఎలా సోకింది?

ఫ్రాన్స్‌లో మరణించిన వ్యక్తికి వైరస్ ఎలా సోకిందన్న దానిపై డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ బారిన పడ్డ జంతువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అతడు జీవించడం, అక్కడే ఈ మిడ్జెజ్ కీటకాలు ఉండటం వల్లనే అతడికి ఈ పరిస్థితి వచ్చిందని డబ్లూహెచ్ఓ స్పష్టం చేసింది. ప్రపంచంలో ఈ తరహా కేసు ఒక్కటే నమోదైందని, ఈ వైరస్ బారిన పడితే మనుషుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తేలాల్సి ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!