E-PAPER

‘దేశ ప్రతిష్టను తాకట్టు పెడుతున్నారు’..! రాహుల్‌పై ప్రధాని మోదీ ఫైర్..!

న్యూఢిల్లీలో ఓ జాతీయ మీడియా సమ్మిట్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో అశాంతిని సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఒక కుటుంబం కోసం దేశ ప్రతిష్టను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతను మళ్లీ మళ్లీ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్‌లో కూడా ఇన్ని రాకెట్ ప్రయోగాలు జరగవేమోనని, కానీ కాంగ్రెస్ మాత్రం ఏడాదికి ఎన్నిసార్లు తమ నేతను లాంచ్ చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తుందో లెక్కేలేదని చురకలంటించారు. కేవలం ఒక కుటుంబం పరువు నిలబెట్టడం కోసం దేశ అభివృద్ధిని, విజయాలను పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ భారత్ ప్రగతిని కొనయాడుతుంటే కొందరు మాత్రం దేశంలో అశాంతిని (Disorder) కోరుకుంటున్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ను బలమైన దేశంగా ప్రపంచం ముందుంచాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. కానీ కొందరు మాత్రం విదేశాలకు వెళ్లి భారత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ శక్తులు దేశంలో జోక్యం చేసుకోవాలని కోరడం సరికాదని హితవు పలికారు.

మరోవైపు కాంగ్రెస్ పరాన్నజీవిలా మారిందన్న ప్రధాని.. తాను ఎదగకపోగా, ఇతరులను కూడా ఎదగనివ్వడం లేదని విమర్శించారు. అందని ద్రాక్ష పుల్లన అన్న చందంగా అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి మారిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కరువైందని ప్రధాని పేర్కొన్నారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తిని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో.. తమ పార్టీలోని ఇతర ప్రతిభావంతులైన యువ ఎంపీలను సైతం మాట్లాడనివ్వకుండా అణిచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానాన్ని ‘దిమాగీ నక్సల్స్’ తమ చేతుల్లోకి తీసుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఆలోచనా శక్తి నశించిందని ఎద్దేవా చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!