E-PAPER

హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో రీస్టోరేషన్‌ బెనిఫిట్‌..! చాలామందికి తెలియని 4 నష్టాలు..!

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఈ మధ్య రిస్టోరేషన్‌ బెనిఫిట్‌ ఉన్న పాలసీని ఎంచుకుంటున్నారు. పాలసీపై పూర్తి బీమా మొత్తం ఖర్చయితే తిరిగి అంతే మొత్తాన్ని పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. కొన్ని పాలసీలు 100 శాతం రీస్టోరేషన్‌తో పాటు ఏడాదిలో ఎన్నిసార్లైనా ఈ ప్రయోజనం పొందవచ్చని ప్రచారం చేస్తాయి. అయితే, ఈ ఫీచర్‌కు కొన్ని షరతులు ఉంటాయి. వాటిని తెలుసుకోకుండా పాలసీ తీసుకుంటే అవసరమైన సమయంలో పూర్తి ప్రయోజనం పొందలేకపోవచ్చు. మనీకంట్రోల్‌ ప్రచురించిన కథనం ప్రకారం.. పాలసీదారులు తెలుసుకోవాల్సిన నాలుగు ప్రధాన పరిమితులు ఇవే.. 

1. బీమా మొత్తం ఖర్చయినప్పుడే రీస్టోరేషన్‌
కొన్ని పాలసీల్లో బీమా మొత్తంలో కొంత ఖర్చయినా రీస్టోరేషన్‌ ప్రయోజనం అందుబాటులోకి వస్తుంది. మరికొన్ని పాలసీల్లో మాత్రం మొదట కేటాయించిన బీమా మొత్తం పూర్తిగా ఖర్చయిన తర్వాతే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఉదాహరణకు, మీ పాలసీ కవరేజ్‌ రూ.10 లక్షలు అనుకుందాం. మొదటి చికిత్సకు రూ.8 లక్షలు ఖర్చయితే, మిగిలిన రూ.2 లక్షలు ఉన్నంత మాత్రాన అదనపు కవరేజ్‌ వెంటనే అందుబాటులోకి వస్తుందని భావించకూడదు. ఇది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

2. అదే అనారోగ్యానికి మళ్లీ చికిత్స పొందితే..
కొన్ని పాలసీలు రీస్టోర్‌ చేసిన మొత్తాన్ని వేరే అనారోగ్యానికి మాత్రమే వినియోగించుకునే అవకాశం కల్పిస్తాయి. మొదట చికిత్స పొందిన అదే వ్యాధి మళ్లీ తిరగబెడితే రీస్టోరేషన్‌ మొత్తం వర్తించకపోవచ్చు. అయితే, కొన్ని ప్లాన్లు ఒకే వ్యాధికి సంబంధించిన తదుపరి చికిత్సలకు కూడా ఈ ప్రయోజనాన్ని అనుమతిస్తాయి.

3. అన్‌లిమిటెడ్‌ రీస్టోరేషన్‌ ఉన్నా..
పాలసీలో అన్‌లిమిటెడ్‌ రీస్టోరేషన్‌ ఉందని తక్కువ బీమా మొత్తంతో సరిపెట్టుకోవడం ప్రమాదకరం. ఉదాహరణకు, మీ బేస్‌ కవరేజ్‌ రూ.10 లక్షలు కాగా ఒకే ఆసుపత్రి చికిత్సకు రూ.15 లక్షలు ఖర్చయితే, మిగిలిన రూ.5 లక్షలు రీస్టోరేషన్‌ ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లిస్తారని అనుకోవద్దు. సాధారణంగా రీస్టోరేషన్‌ ప్రయోజనం తదుపరి క్లెయిమ్‌లకు వర్తించేలా ఉంటుంది. కాబట్టి కుటుంబ అవసరాలకు సరిపోయే బేస్‌ కవరేజ్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

4. రీస్టోర్‌ చేసిన మొత్తంపైనా అదనపు పరిమితులు
కొన్ని పాలసీల్లో రీస్టోర్‌ చేసే మొత్తం, ఎన్నిసార్లు వినియోగించుకోవచ్చు? ఏ చికిత్సలకు వర్తిస్తుంది? అనే అంశాలపై పరిమితులు ఉంటాయి. కొన్ని ప్రయోజనాలు ఆసుపత్రిలో చేరి పొందే చికిత్సలకే వర్తించవచ్చు. పాలసీని బట్టి ఆసుపత్రిలో చేరే ముందు, డిశ్చార్జ్‌ తర్వాత అయ్యే ఖర్చులకు ఈ అదనపు కవరేజ్‌ వర్తించకపోవచ్చు. అలాగే, ఉపయోగించని రీస్టోర్‌ చేసిన మొత్తాన్ని తదుపరి పాలసీ సంవత్సరానికి తీసుకెళ్లే అవకాశం సాధారణంగా ఉండదు. కొన్ని ప్లాన్లలో రీస్టోరేషన్‌ కోసం అదనపు ప్రీమియం కూడా ఉండవచ్చు.

అందువల్ల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎంచుకునేటప్పుడు కేవలం రీస్టోరేషన్‌ బెనిఫిట్‌ ఉందా? లేదా? అని చూడటం సరిపోదు. అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఒకే వ్యాధికి వర్తిస్తుందా? ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చు? ఏ ఖర్చులకు వర్తిస్తుంది? అనే అంశాలను పాలసీ పత్రాల్లో పరిశీలించాలి. రీస్టోరేషన్‌ను అదనపు రక్షణగా చూడాలి తప్ప, తక్కువ బేస్‌ కవరేజ్‌కు ప్రత్యామ్నాయంగా భావించొద్దు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!