E-PAPER

కలాం ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలి: రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు

బాపట్లలో ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలు

బాపట్ల, అక్టోబర్‌ 15 (వై7 న్యూస్‌ తెలుగు):

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జీవితం యువతకు ఆదర్శమని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు అన్నారు. కలాం జయంతిని పురస్కరించుకుని గురువారం బాపట్ల మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యువత చిన్న లక్ష్యాలకు పరిమితం కాకుండా ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని కలాం ఇచ్చిన సందేశాన్ని గుర్తుచేశారు. జ్ఞానం సృజనాత్మకతకు, సృజనాత్మకత నూతన ఆలోచనలకు దారితీస్తుందన్న ఆయన మాటలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం తన ప్రతిభ, పట్టుదల, నిరంతర కృషితో దేశ అత్యున్నత పదవిని అధిరోహించారని కొనియాడారు. భారత అంతరిక్ష, క్షిపణి రంగాల అభివృద్ధికి విశేష సేవలందించి ‘మిసైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 2002 నుంచి 2007 వరకు రాష్ట్రపతిగా సేవలందించిన కలాం.. విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేశారని తెలిపారు.

కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ వలి, కోశాధికారి కోళ్ళపూడి బాలాజీ, సభ్యులు ఇ. హరిబాబు, కోళ్ళపూడి ఉపేంద్ర గుప్త, ఎస్‌. రమేష్‌ బాబు, కొత్త ఆంజనేయ వరప్రసాద్‌, అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ నిర్వాహకుడు పఠాన్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!