రంగోయి చెడ్డెమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ఎన్నికల సన్నాహాలపై నాయకుల చర్చ
శ్రీకాకుళం జిల్లా, అక్టోబర్ 13 | Y7 న్యూస్ తెలుగు
పలాస: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలాస మండల వైఎస్సార్‌సీపీ నాయకులు సన్నాహాలు ప్రారంభించారు. మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచనల మేరకు పార్టీ నాయకులు ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో మంగళవారం పలాస మండలం రంగోయి గ్రామంలోని శ్రీ చెడ్డెమ్మ అమ్మవారి ఆలయంలో మండల, పంచాయతీ స్థాయి నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం స్థానిక ఎన్నికల సన్నాహాలపై చర్చించారు.
పంచాయతీల వారీగా కార్యాచరణ
గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, పంచాయతీల వారీగా ఎన్నికల పరిస్థితులను సమీక్షించడం, బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయడం వంటి అంశాలపై నాయకులు దృష్టి సారించినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
స్థానిక సమస్యలపై ప్రజలతో మమేకమవుతూ, పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేయాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పైల చిట్టీబాబు, రాష్ట్ర కార్యదర్శి ఉంగ సాయికృష్ణ, అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన పిలుపునిచ్చారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు నాయకత్వంలో ఎన్నికల కోసం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పలాస మండల వైసీపీ అధ్యక్షుడు దువ్వాడ రవి, బత్తిన హేమేశ్వరరావు, మచ్చ ధనరాజ్, చింతాడ మాధవరావు, సంతోష్ సూర్య, గొండు మోహన్, షణ్ముఖతో పాటు పలాస మండలంలోని వివిధ పంచాయతీలకు చెందిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.









