చనిపోయిన, పదవీ విరమణ చేసిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్
పలాస, అక్టోబర్ 13, Y7 న్యూస్ తెలుగు:
పలాస మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఈ నిరసనలో చనిపోయిన, పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. వెంకటి, బి. కూర్మారావు మాట్లాడుతూ.. పలాస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తూ పలువురు కార్మికులు మరణించగా, మరికొందరు పదవీ విరమణ చేశారని తెలిపారు. వారి స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఏళ్ల తరబడి కార్మికులతో పని చేయించుకుని, కనీసం గ్రాట్యుటీ కూడా చెల్లించకుండా ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అయితే ఆప్కాస్ పేరుతో కాంట్రాక్టు విధానంలో పని కల్పిస్తూ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని అన్నారు.
శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో సేవలను ప్రైవేటీకరించే దిశగా తీసుకొచ్చిన వర్క్ కాంట్రాక్టు విధానాన్ని విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు కె. ఈశ్వరరావు, ఎం. రవి, అమర్ నాయక్, భాస్కర్ రావు, ఎస్. రమేష్, సుజాత, కబేరి, పెంటమ్మ తదితరులతో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
— Y7 న్యూస్ తెలుగు









