E-PAPER

ఉగ్రవాదంపై రెడ్ లైన్ గీశాం: అమెరికాకు జైశంకర్ గట్టి సంకేతం..

భారత్-అమెరికా సంబంధాల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై భారత్ ఆందోళనలను భాగస్వామ్య దేశాలు గుర్తించకపోతే, అది ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఒక ‘రెడ్ లైన్’ గీసుకుందని, ఈ విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నత స్థాయి సమావేశాల అనంతరం న్యూయార్క్‌లో ‘ఏషియా సొసైటీ’ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. దశాబ్దాలుగా ఒక పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుని భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆయన దుయ్యబట్టారు. 

“అత్యంత కీలకమైన ఉగ్రవాద సమస్యపై మా భాగస్వామ్య దేశాల నుంచి సరైన అవగాహన, సానుభూతి లభించకపోతే, అది కచ్చితంగా ఇబ్బందులకు దారితీస్తుంది. మా ప్రాథమిక ఆందోళనలను విస్మరిస్తే, సంబంధాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

భారత్-అమెరికా సంబంధాలను ప్రభావితం చేసే అంశాల్లో వాణిజ్య, టారిఫ్ వివాదాలతో పాటు ఉగ్రవాదం కూడా ప్రధానమైనదని జైశంకర్ వివరించారు. ప్రస్తుత అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్‌ పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్న తరుణంలో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భారత్-అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నప్పటికీ, పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో వాస్తవిక దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పొరుగు దేశం నుంచే మద్దతు అందుతోందని నిరూపించేందుకు భారత్ పదేపదే తగిన ఆధారాలను సమర్పించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!