E-PAPER

భార్యపై కత్తిపీటతో భర్త దాడి.. మెడపై లోతైన గాయం

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి, సెప్టెంబర్ 26 (Y7 News Telugu): నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో భార్యపై భర్త కత్తిపీటతో దాడి చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ మెడకు తీవ్ర గాయం కావడంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లో నివాసముంటున్న సిద్దెల వీరలక్ష్మి తన భర్త నర్సింహారావుతో కలిసి ఇటీవల పైనంపల్లిలోని తల్లిగారింటికి వచ్చారు. నర్సింహారావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శనివారం సాయంత్రం వీరలక్ష్మి ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన నర్సింహారావు కత్తిపీటతో ఆమె మెడపై దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. దాడిలో వీరలక్ష్మి మెడకు లోతైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.

స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. పరారీలో ఉన్న నర్సింహారావు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!