చర్ల, సెప్టెంబర్ 24 (Y7 న్యూస్ తెలుగు):
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 8 స్పిల్‌వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 73.34 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 74 మీటర్లు కాగా, ప్రస్తుతం ఎగువ నుంచి 12,105 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
వరద ఉధృతి నేపథ్యంలో 8 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 10,849 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎడమ కాలువ (LFMC) ద్వారా 60 క్యూసెక్కులు, కుడి కాలువ (RFMC) ద్వారా 12 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తాలిపేరు ప్రాజెక్టు గ్రాస్ కెపాసిటీ 730 ఎంసీఎఫ్‌టీ కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 607.10 ఎంసీఎఫ్‌టీగా ఉంది.
ఇదిలా ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లోని ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి విడుదలవుతున్న వరద నీరు గోదావరి నదిలోకి చేరుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రైతులు, ప్రజలు కాలువలు, వాగులు, వరద ప్రవాహ ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.








