చర్ల, సెప్టెంబర్ 24(Y7news telugu): మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చర్ల సర్పంచ్ పూజారి సామ్రాజ్యం సూచించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అవసరం లేకుండా బయటకు రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలు, చెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. వర్షాల సమయంలో వాగులు, వంకలు, కాలువలు దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా అత్యవసర సమస్య ఎదురైతే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని సర్పంచ్ తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సురక్షితంగా ఉండాలని పూజారి సామ్రాజ్యం విజ్ఞప్తి చేశారు.








