చైనా అంతరిక్ష రంగంలో దూకుడు పెంచుతోంది. కేవలం 45 గంటల వ్యవధిలో నాలుగు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. మూడు వేర్వేరు ప్రయోగ కేంద్రాల నుంచి ఈ ప్రయోగాలు జరిగాయి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో చేపట్టిన ఈ ప్రయోగాల్లో ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీల రాకెట్లు కూడా ఉన్నాయి.
మొదటి ప్రయోగం సెప్టెంబర్ 15న జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగింది. ల్యాండ్‌స్పేస్ సంస్థకు చెందిన జుక్యూ-2ఈ రాకెట్ 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. క్వియాన్‌ఫాన్ బ్రాడ్‌బ్యాండ్ మెగా శాటిలైట్ నెట్వర్క్ కోసం వీటిని పంపారు. ఈ నెట్‌వర్క్‌లో భవిష్యత్తులో దాదాపు 15 వేల ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
అదే రోజు షాంఘై సముద్ర తీరంలోని మొబైల్ ప్లాట్‌ఫామ్ నుంచి ఒరియెన్స్పేస్ గ్రావిటీ-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మరో తొమ్మిది క్వియాన్‌ఫాన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. ఘన ఇంధనంతో పనిచేసే ఈ రాకెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సాలిడ్ ఫ్యూయల్ రాకెట్‌గా గుర్తింపు పొందింది.
మూడో ప్రయోగం హైనాన్ దీవిలోని వెన్చాంగ్ కేంద్రం నుంచి జరిగింది. ప్రభుత్వ రంగానికి చెందిన లాంగ్ మార్చ్-12 రాకెట్ తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. ఇవి సాట్నెట్ పేరుతో ఏర్పాటు చేస్తున్న మరో భారీ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ కోసం ఉద్దేశించినవి. ఇందులో దాదాపు 13 వేల ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ప్రణాళిక ఉంది.
నాలుగో ప్రయోగంతో ఈ వరుస ముగిసింది. జియుక్వాన్ నుంచి కుయ్జౌ-11 రాకెట్ రెండు రాడార్ భూ పరిశీలన ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. మొత్తంగా నాలుగు ప్రయోగాల్లో 30 ఉపగ్రహాలను చైనా కక్ష్యలోకి పంపింది.
ఈ నాలుగు ప్రయోగాలు చైనా అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్ర పెరుగుతున్న విషయాన్ని కూడా చూపించాయి. అయితే ఈ నాలుగు ప్రయోగాల్లో ఏ రాకెట్ బూస్టర్‌ను తిరిగి భూమికి తీసుకురాలేదు. కాగా, జుక్యూ-3, లాంగ్ మార్చ్-10బీ రాకెట్ల తొలి దశలను విజయవంతంగా ల్యాండ్ చేసి పునర్వినియోగ సాంకేతికతలో చైనా ముందడుగు వేసింది.









