భద్రాచలం: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో శనివారం గోదావరి నది తీరంలోని నిమజ్జన ఘాట్లను కలెక్టర్ పరిశీలించారు.

సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట్, డీఎస్పీ అరుణ్ కుమార్తో కలిసి ఘాట్లను పరిశీలించిన కలెక్టర్.. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఘాట్ల వద్ద బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, లాంచీలను కూడా ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు.

నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ, వైద్య, రవాణా, అగ్నిమాపక, ఇరిగేషన్, దేవాదాయ, పంచాయతీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం చేపట్టాలని, వాహనాలను నిర్ణయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలపాలని భక్తులకు సూచించారు.
ఊరేగింపుల సమయంలో డీజేలు, అధిక శబ్దానికి దూరంగా ఉంటూ శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించాలని నిర్వాహకులను కోరారు.
అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించిన కలెక్టర్.. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఉత్తర ద్వారం, చిత్రకూట మండపం, గోశాల, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్, మాడవీధుల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఆలయ నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి ఘాట్ల అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పర్యటనలో భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, పంచాయతీ ఈఓ శ్రీనివాస్ రావు, దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఎంవీఐ వెంకట పుల్లయ్య, ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు, ఇరిగేషన్ ఏఈఈలు రవితేజ, గణేష్, ఐటీసీ ప్రతినిధులు చెంగల్ రావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.









