ప్రతిరోజూ కోట్లాది మంది ChatGPTని వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇందులో వ్యక్తిగత విషయాల నుంచి పని, చదువు, ఇతర సమాచారానికి సంబంధించిన చర్చల వరకు ఎన్నో సంభాషణలు చేస్తుంటారు. అయితే అవసరం లేని చాట్లను తొలగించాలనుకున్నప్పుడు ChatGPTలో కనిపించే Delete, Archive ఆప్షన్ల మధ్య తేడా ఏంటనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనిపై OpenAI స్పష్టమైన వివరాలను వెల్లడించింది.
చాట్‌ను Archive చేస్తే అది కేవలం ప్రధాన చాట్ లిస్ట్ నుంచి దాచబడుతుంది. ఆ సంభాషణ మీ ఖాతాలోనే ఉంటుంది. Settings > Data Controls > Archived Chatsలోకి వెళ్లి ఎప్పుడైనా దాన్ని తిరిగి యాక్టివ్ చాట్ హిస్టరీలోకి తీసుకురావచ్చు. అంటే ముఖ్యమైన చాట్‌ను తొలగించకుండా హిస్టరీని క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటే Archive ఆప్షన్ ఉపయోగపడుతుంది.
అదే Delete చేస్తే చాట్ వెంటనే హిస్టరీ నుంచి తొలగిపోతుంది. ఆ తర్వాత దాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదు. OpenAI ప్రకారం, డిలీట్ చేసిన చాట్‌ను సాధారణంగా 30 రోజుల్లోపు సిస్టమ్‌ల నుంచి శాశ్వతంగా తొలగించేందుకు షెడ్యూల్ చేస్తారు. అయితే భద్రత, చట్టపరమైన అవసరాలు లేదా ఇప్పటికే గుర్తింపు తొలగించిన డేటాకు సంబంధించిన కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. కాబట్టి భవిష్యత్తులో అవసరం ఉండొచ్చని భావించే చాట్లను Delete చేయకుండా Archive చేయడం మంచిది.








