యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్, నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త కీలక పాత్రలో కనిపించనున్నారు.
సంయుక్త పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో సంయుక్త చేతిలో కత్తి పట్టుకుని శత్రువులతో పోరాడే వీరనారి పాత్రలో కనిపించారు. సినిమాలో ఆమె ‘భూమి’ అనే శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం సంయుక్త గుర్రపు స్వారీతో పాటు యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు.
ఇప్పటివరకు విభిన్న భావోద్వేగ పాత్రల్లో కనిపించిన సంయుక్త.. ‘స్వయంభూ’లో యోధురాలిగా కొత్తగా కనిపించనున్నారు. ఈ పాత్ర తన కెరీర్లోనే సవాలుతో కూడుకున్నదిగా నిలవనుంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా, సినిమా విడుదల తేదీని చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.








