తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన సంజ్ఞపై రాజకీయంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘తమ్ముడు విజయ్..’’ అంటూ ఆయన విడుదల చేసిన వీడియో సందేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా స్టాలిన్ విజయ్‌కి తన సందేశాన్ని తెలియజేస్తూ, గతంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
1975-77 ఎమర్జెన్సీ సమయంలో డీఎంకే ప్రభుత్వం రద్దయిన సందర్భంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను స్టాలిన్ వివరించారు. జైలులో పోలీసులు, జీవిత ఖైదీల చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురయ్యామని చెప్పారు. రాత్రిపూట నిద్రపోనివ్వకుండా లాఠీలు, బూట్లతో దాడి చేశారని తెలిపారు. ఆ దాడుల్లో తన దవడ ఎముకలు విరిగిపోయాయని, అప్పటి గాయాలకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ తన శరీరంపై ఉన్నాయని పేర్కొన్నారు.
తమిళనాడు, తమిళుల కోసం పోరాడిన నాయకులకు ఇలాంటి అణచివేతలు కొత్తేమీ కాదని స్టాలిన్ అన్నారు. డీఎంకే చరిత్రలో తాను కూడా భాగమైనందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. విజయ్ చేసిన సంజ్ఞపై కొనసాగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చకు దారితీశాయి.









