ఉదయం టిఫిన్ దగ్గర నుంచి సాయంత్రం తాగే టీతో పాటు తినే బిస్కెట్ల వరకు.. మనకు తెలియకుండానే పామాయిల్ రోజువారీ ఆహారంలో భాగమవుతోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పామాయిల్ పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ‘ఆరోగ్యానికి హానికరమా?’ అన్న ప్రశ్నే. అయితే దీనిపై నిపుణుల అభిప్రాయం కాస్త భిన్నంగా ఉంది. ఎంత తీసుకుంటున్నారు? ఏ రూపంలో తీసుకుంటున్నారు? అన్నదే అసలు విషయం.
పామాయిల్ అంటే..
ఆయిల్ పామ్ చెట్టు పండ్ల నుంచి పామాయిల్‌ను తయారు చేస్తారు. ఇందులో పాల్మిటిక్ యాసిడ్, ఒలియిక్ యాసిడ్, లినోలియిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. విటమిన్-ఈ, కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. అయితే పామాయిల్ ఆరోగ్యంపై చూపే ప్రభావం దాని శుద్ధి విధానం, తీసుకునే మోతాదు, వ్యక్తి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.
రకాలు కూడా ఉన్నాయి
పామాయిల్‌లో ముడి లేదా రెడ్ పామాయిల్, శుద్ధి చేసిన పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ ప్రధాన రకాలు. రెడ్ పామాయిల్‌లో కెరోటినాయిడ్లు, విటమిన్-ఈ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. శుద్ధి చేసే సమయంలో వీటిలో కొంత భాగం తగ్గిపోతుంది. పామ్ కెర్నల్ ఆయిల్‌ను పామ్ పండు విత్తనం నుంచి తీస్తారు.
గుండెకు ఎంత ముప్పు?
పామాయిల్‌లో కొలెస్ట్రాల్ ఉండదు. 100 గ్రాముల నూనెలో సుమారు 884 క్యాలరీలు, 49-50 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరగొచ్చు. అయితే పామాయిల్ గుండెకు నేరుగా హానికరమని చెప్పేందుకు ఆధారాలు లేవు.
మంచి కూడా ఉంది
మోతాదులో తీసుకుంటే పామాయిల్ నుంచి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే టోకోట్రియనాల్స్, టోకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడొచ్చు. రెడ్ పామాయిల్‌లోని కెరోటినాయిడ్లు విటమిన్-ఏకు మూలంగా ఉపయోగపడతాయి.
అసలు సమస్య ఎక్కడంటే..
ఒకే నూనెను పదేపదే వేడి చేసి వాడటం మంచిది కాదు. ముఖ్యంగా ప్యాకేజ్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే పామాయిల్ వినియోగం కూడా పెరుగుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరగడం వంటి సమస్యలు రావొచ్చు. అందుకే ఆహార లేబుల్స్ చూడటం అలవాటు చేసుకోవాలి.
ఎంత తీసుకోవాలి?
పామాయిల్‌ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే మితంగా తీసుకోవడం ముఖ్యం. రోజువారీ మొత్తం కేలరీల్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ వాటా 10 శాతానికి మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. పామాయిల్‌తో పాటు నట్స్, విత్తనాలు, అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే నూనెలను ఆహారంలో సమతుల్యంగా చేర్చుకోవడం మంచిది.
పామాయిల్ పేరు చూసి భయపడాల్సిన పనిలేదు. అదే సమయంలో ఎంత పడితే అంత వాడటం కూడా సరైంది కాదు. మోతాదు, నూనె నాణ్యత, వాడే విధానం, మొత్తం ఆహారపు అలవాట్లు.. ఇవే ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని నిర్ణయిస్తాయి.








