శ్రీకాకుళం, సెప్టెంబర్ 2: రెడ్ క్రాస్ సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రస్థాయి ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ అవార్డు లభించింది. ఈ అవార్డును శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందుకున్నారు.
2024-25 సంవత్సరానికి గాను జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, వైద్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష కృషి చేసినందుకు ఈ గుర్తింపు లభించింది.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 1న నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గవర్నర్ గోల్డ్ మెడల్‌ను కలెక్టర్ స్వీకరించారు.
జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు పొందడంతో ఈ అవార్డు దక్కింది. ముఖ్యంగా రక్తదానం, ఆరోగ్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో రెడ్ క్రాస్ సేవలకు సహకరించిన అధికారులు, వాలంటీర్లు, రక్తదాతలు మరియు సభ్యులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు.








