నోటిలో పుండ్లు రావడం చాలా సాధారణమైన సమస్య. పొరపాటున చెంప లేదా నాలుకను కొరుక్కోవడం, మరీ వేడిగా ఉన్న ఆహారం తీసుకోవడం, ఒత్తిడి, పోషకాహార లోపాలు వంటి వివిధ కారణాలతో నోటిపుండ్లు ఏర్పడవచ్చు. సాధారణంగా ఇలాంటి పుండ్లు పెద్దగా చికిత్స అవసరం లేకుండానే ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గిపోతాయి.
అయితే నోటిలో ఏర్పడిన పుండు ఎంతకీ తగ్గకుండా అలాగే కొనసాగితే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఒకే ప్రదేశంలో పదేపదే పుండు రావడం, పుండు పరిమాణం క్రమంగా పెరగడం, ఎక్కువ కాలం నొప్పి లేదా అసౌకర్యం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది. ఇలాంటి లక్షణాలకు అసలు కారణాన్ని గుర్తించడం అవసరం.
అదేవిధంగా నోటిలో పుండ్లతో పాటు తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, రక్తస్రావం, మింగడంలో ఇబ్బంది, నోటిని తెరవడంలో సమస్య వంటి మార్పులు కనిపిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నోటిపుండు ప్రమాదకరం అని కాదు.. కానీ ఎక్కువకాలం తగ్గకపోవడం లేదా తరచూ పునరావృతం కావడం వంటి మార్పులను మాత్రం వైద్యుల సూచనతో పరిశీలించుకోవడం ఉత్తమం.








