గినియా రాజధాని కోనాక్రీలో ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి నగరంలోని అతిపెద్ద చెత్త డంపింగ్ యార్డు ఒక్కసారిగా కుప్పకూలింది. ఏళ్లుగా పేరుకుపోయిన భారీ చెత్త కుప్పలు కొండచరియల్లా విరిగిపడి సమీపంలోని పేదల గుడిసెలపై పడటంతో 30 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
కోనాక్రీలోని దార్ ఎస్ సలామ్ ప్రధాన చెత్త డంపింగ్ యార్డు వద్ద ఆదివారం రాత్రి సుమారు 2 గంటల సమయంలో భారీ వర్షం ప్రారంభమైనట్లు సమాచారం. వర్షపు నీటి ఉధృతికి అక్కడ పేరుకుపోయిన భారీ చెత్త కుప్పలు ఒక్కసారిగా కదిలి కిందికి జారిపోయాయి. దీంతో సమీపంలోని పేదల గుడిసెలు, తాత్కాలిక నివాసాలు చెత్త, మట్టి కుప్పల కింద పూర్తిగా కూరుకుపోయాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు గాఢ నిద్రలో ఉండటంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా పేరుకుపోయిన చెత్త, మట్టి కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.








