E-PAPER

BRICS సదస్సుకు జిన్‌పింగ్ రాక.. ఏడేళ్ల తర్వాత భారత్‌లో చైనా అధ్యక్షుడు!

సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశాలకు భారత్ సభ్య దేశాలను ఆహ్వానించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతుండగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వస్తారా లేదా అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే తాజాగా జిన్‌పింగ్ భారీ బృందంతో భారత్‌కు రానున్నట్లు రాయిటర్స్‌ వెల్లడించినట్లు సమాచారం. డోక్లాం ఘర్షణ తర్వాత దాదాపు ఏడేళ్లకు ఆయన భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ సదస్సుకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత పెరిగింది.

BRICS శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనుంది. జిన్‌పింగ్ వచ్చే నెలలో ఈ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యటన భారత్‌-చైనా మధ్య మెరుగుపడుతున్న సంబంధాలకు సంకేతంగా నిలిచే అవకాశం ఉందని రాయిటర్స్‌ పేర్కొంది. దీంతో BRICS సమావేశాల కంటే జిన్‌పింగ్‌ పర్యటనపైనే అంతర్జాతీయంగా ఎక్కువ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవల భారత్‌-చైనా మధ్య పలు కీలక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా చైనాలో పర్యటిస్తూ కీలక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల, సరిహద్దు అంశాలు, ద్వైపాక్షిక సహకారం వంటి పలు కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనతో ఇరు దేశాల సంబంధాల్లో కొత్త పరిణామాలకు నాంది పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!