స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు, ఖలిస్థానీ గ్రూపుల నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో విస్తృత భద్రతా చర్యలు చేపట్టారు. ఆకస్మిక నిరసనలు, ఆందోళనలు వేడుకలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందన్న అంచనాతో కీలక ప్రాంతాల్లో నిఘాను పెంచారు.
ఈ క్రమంలో ఇండియన్ ముజాహిదీన్, అల్‌ఖైదా, ఖలిస్థానీ గ్రూపులతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు, పోస్టర్లను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ వ్యక్తులను గుర్తించేందుకు వీలుగా పోస్టర్లను ప్రముఖ ప్రదేశాల్లో ప్రదర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా ప్రజల సహకారాన్ని కోరుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా జరిగేలా ఢిల్లీ పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు.








