కొత్తగూడెం, ఆగస్టు 1 (వై7 న్యూస్ తెలుగు)
యువతిపై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి రేగా కాంతారావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజకీయ పార్టీలన్నీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకుడిపై బీఆర్ఎస్ అధిష్టానం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి, రేగా కాంతారావును పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేయాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని ఆయన కోరారు.
మహిళల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని, చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.









