
భద్రాద్రి కొత్తగూడెంను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏఐపీకేఎంఎస్ డిమాండ్
భద్రాచలం, జూలై 29 (వై7 న్యూస్):
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి నెలకు ₹7,500 కరువు భత్యం చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా కార్యదర్శి జాటోతు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం భద్రాచలంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు లేక కార్మికులు ఉపాధి కోల్పోయి వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వ్యవసాయ కార్మికులకు నెలకు ₹12 వేల జీవన భృతి అందిస్తామని ప్రకటించిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి మండల, డివిజన్ కార్యాలయాలకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10న జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు మెమోరాండం అందజేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ఆగస్టు 20లోపు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు వ్యవసాయ కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సంఘం నాయకులు నాయిని రాజు, చింతకాయల సరళ, వెంకటమ్మ శాస్త్రి, బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.








