నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ కొనసాగుతున్న ఈ సినిమా విడుదల ఆలస్యమైనప్పటికీ, తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని ప్రత్యేక గీతం కోసం కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
కీర్తి సురేష్‌కు దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ సినిమా ద్వారా మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే నానితో ‘నేను లోకల్’ చిత్రంలో కలిసి నటించిన అనుభవం కూడా ఉంది. ఈ సాన్నిహిత్యం కారణంగానే స్పెషల్ సాంగ్‌కు ఆమె వెంటనే అంగీకరించినట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ ప్రత్యేక గీతానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. కథకు అనుగుణంగా, స్టైలిష్‌గా ఈ పాటను తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కీర్తి సురేష్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ సంగీతం కలిస్తే ఈ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.









