ఇరాన్‌తో కొనసాగుతున్న కీలక చర్చలు విఫలమైతే మరింత తీవ్ర సైనిక చర్యలు చేపట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దౌత్యపరమైన పరిష్కారానికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇరాన్‌పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు వేగంగా ఫలించాలని, లేకపోతే వాటిని కొనసాగించడం అవసరం లేదని స్పష్టం చేశారు.
అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్‌తో లోతైన స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే మరింత శక్తివంతమైన సైనిక చర్యలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. చర్చలకు ఎక్కువ గడువు ఇవ్వబోమని, త్వరితగతిన ఫలితాలు రావాల్సిందేనని పేర్కొన్నారు.
ఇరాన్‌తో మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాల విజ్ఞప్తి మేరకే అమెరికా దాడులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ చెప్పారు. దాడులు నిలిచిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం సానుకూల పరిణామాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చర్చలు విఫలమైతే అమెరికా తన తదుపరి చర్యల విషయంలో వెనక్కి తగ్గదని మరోసారి స్పష్టం చేశారు.








