తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను ఒకే రోజులో సందర్శించాలనుకునే వారికి తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSTDC) ప్రత్యేక హెరిటేజ్ అండ్ పిల్గ్రిమేజ్ టూర్ ప్యాకేజీను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రతి శనివారం నిర్వహించే ఈ టూర్‌లో యాదాద్రి, కొలనుపాక జైన్ ఆలయం, స్వర్ణగిరి ఆలయం, శిల్పరామం, భూదాన్ పోచంపల్లి వంటి ఐదు ప్రముఖ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
టూర్‌లో సందర్శించే ప్రదేశాలు
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
హైదరాబాద్ నుంచి ఏసీ మినీ కోచ్‌లో ప్రయాణం ప్రారంభమై మొదట యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ స్వామివారి దర్శనం అనంతరం హరిత హోటల్‌లో అల్పాహారం ఏర్పాటు చేస్తారు.
శిల్పరామం
తెలంగాణ కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే శిల్పరామంలో చేతివృత్తుల కళాఖండాలు, హస్తకళా ఉత్పత్తులు, జానపద సంస్కృతిని సందర్శకులు వీక్షించవచ్చు.
కొలనుపాక జైన్ ఆలయం
శతాబ్దాల చరిత్ర కలిగిన కొలనుపాక జైన్ ఆలయం అద్భుతమైన శిల్పకళ, ప్రశాంతమైన వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.
స్వర్ణగిరి ఆలయం
ఇటీవలి కాలంలో భక్తుల ఆదరణ పొందుతున్న స్వర్ణగిరి ఆలయంలో దర్శనం చేసుకునే అవకాశం కూడా ఈ టూర్‌లో ఉంటుంది.
భూదాన్ పోచంపల్లి
చివరిగా ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి ఇకట్ హ్యాండ్లూమ్ గ్రామాన్ని సందర్శిస్తారు. స్థానికంగా తయారయ్యే చీరలు, వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు
- ఏసీ మినీ బస్‌లో ప్రయాణం
- యాదాద్రి హరిత హోటల్‌లో ఉదయం అల్పాహారం
- వివేరా హోటల్‌లో శాకాహార మధ్యాహ్న భోజనం
- పోచంపల్లిలో సాయంత్రం హై-టీ
- అన్ని ఆలయాల దర్శనం
- సౌకర్యవంతమైన రవాణా
ప్యాకేజీ ధరలు
- పెద్దలకు: రూ. 2,070
- పిల్లలకు: రూ. 1,770
ఈ ప్రత్యేక టూర్ ప్రతి శనివారం నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలు, బుకింగ్ కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప TSTDC కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.









