E-PAPER

అయోధ్య పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపణ.. మోదీ, చంద్రబాబుపై చింతా మోహన్ విమర్శలు

 

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అయోధ్యలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయోధ్య పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అలాగే ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఏ అంశాలపై చర్చించారో దేశ ప్రజలకు వివరించాలని కోరారు.

రాష్ట్ర అభివృద్ధిపై కూడా చింతా మోహన్ ప్రశ్నలు లేవనెత్తారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఆ స్థాయి అభివృద్ధి కనిపించడం లేదన్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తూ, మాటలకంటే పనులతోనే అభివృద్ధిని నిరూపించాలని సూచించారు.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని కూడా చింతా మోహన్ ప్రశ్నించారు. జయలలితకు ఒక న్యాయం, జగన్‌కు మరో న్యాయమా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని పోలీసులపై ఆరోపణలు చేసిన ఆయన, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు దళిత హోదా వంటి అంశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News