రైతుల భూములు తీసుకునే విధానాలను నిర్మూలించాలని డిమాండ్
రిటన్ సీడ్ వ్యవహారంపై సమగ్ర విచారణకు జేఏసీ విజ్ఞప్తి..
అనాథరైజ్డ్ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి..
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: జేఏసీ హెచ్చరిక…
కరకగూడెం : జూన్ 25 వై సెవెన్ న్యూస్ తెలుగు;
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు:
జేఏసీ మండల అధ్యక్షుడు గొగ్గల కృష్ణ మండల కన్వీనర్ సోలం రామారావు
కరకగూడెం మండలంలో “రిటన్ సీడ్” పేరుతో మోసపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆదివాసీ సంఘాల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించిన జేఏసీ నాయకులు, రైతుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
రిటన్ సీడ్ వ్యవహారంలో అనేక మంది రైతులు ఆర్థికంగా నష్టపోయారని, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి వివిధ పద్ధతుల్లో భూములు తీసుకునే విధానాలను తక్షణమే నిలిపివేసి, బాధిత రైతుల భూములను రక్షించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారానికి బాధ్యుడిగా పేర్కొంటున్న కరకగూడెం మండలం అనంతారం గ్రామానికి చెందిన కొమ్మ శివ (శంకరయ్య కుమారుడు)పై సమగ్ర విచారణ నిర్వహించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రైతులు నష్టపోయిన విషయాలు పత్రికల్లో వచ్చినప్పటికీ స్పందించని వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతులు లేని, అనాథరైజ్డ్ విత్తనాలైన వరి, మొక్కజొన్న, మిర్చి తదితర విత్తనాల విక్రయాలను అరికట్టి, వాటిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని జేఏసీ కోరింది. నకిలీ, నాణ్యతలేని విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు….
– రిపోర్టర్ దిలీప్








