పలాస, జూన్ 25 (Y7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస నగర్‌లో వీధి కుక్కల బెడద మరోసారి వెలుగుచూసింది. గురువారం 10 ఏళ్ల బాలుడు మడ్డు రోహన్‌పై వీధి కుక్కలు దాడి చేయడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
కాలనీలో ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కుక్కలు బాలుడిపై దూసుకెళ్లి దాడి చేశాయి. బాలుడు భయంతో కేకలు వేయగా స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ తీవ్ర భయాందోళనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో కాలనీవాసులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. పట్టణంలో వీధి కుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటి నియంత్రణకు సరైన చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. చిన్నారులు, వృద్ధులు వీధుల్లో నడవాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనూ పలు ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ మున్సిపల్ యంత్రాంగం స్పందన ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు విమర్శించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
శ్రీనివాస నగర్‌తో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంటూ, కుక్కలను పట్టుకుని తరలించడం, జనాభా నియంత్రణ చర్యలు చేపట్టడం, ప్రజలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు









