పలాస సీహెచ్‌సీలో క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షల సాయం
పలాస, నవంబర్ 2 (ప్రత్యేక ప్రతినిధి):
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం జరిగిన తోపులాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన కాశీబుగ్గకు చేరుకుని, ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీటీపీ సీ చైర్మన్ వజ్జ బాబూరావు తదితరులు కూడా అక్కడికి వెళ్లారు.
అనుకోకుండా భక్తుల రద్దీ – ఒకే మార్గం కారణంగా తొక్కిసలాట
ఏకాదశి సందర్భంగా అనుకోకుండా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని మంత్రి లోకేష్ వివరించారు.“ఈ దేవాలయం గత నాలుగైదేళ్లుగా నిర్మాణంలో ఉంది. కేవలం నాలుగు నెలల క్రితం ప్రతిష్ఠ జరిగింది. ఇంతమంది భక్తులు వస్తారని స్థానిక అధికారులకు ముందస్తు సమాచారం లేదు,” అని ఆయన తెలిపారు.ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు దర్శనాల ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఆలయ ద్వారాలు మూసే సమయంలో భక్తులు ఒకే మార్గంలో బయటకు వస్తుండగా, మరికొందరు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని వివరించారు. పై మెట్ల వద్ద ఒక్కొక్కరుగా పడిపోవడంతో తొక్కిసలాట జరిగిందన్నారు.
బ్యారికేడింగ్ లోపం కూడా ప్రమాదానికి కారణం
బ్యారికేడింగ్ ఫౌండేషన్ కేవలం రెండున్నర అంగుళాల లోతుతో మాత్రమే చేయబడిందని, సాధారణంగా ఆరు అంగుళాలు ఉండాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. “ఒక వైపున సిమెంట్ గోడ ఉండటంతో పడిపోయిన భక్తులు తీవ్ర గాయాలు పొందారు. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు,” అని వివరించారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే శిరీష, మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని పలాస సీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున సాయం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు, స్వల్ప గాయాలపాలైన వారికి రూ.50 వేల చొప్పున సాయం అందజేయనున్నట్లు లోకేష్ తెలిపారు.
అదనంగా ప్రధానమంత్రి కార్యాలయం నుండి ప్రతి మృత భక్తి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించబడిందన్నారు.మరణించిన వారిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారని, పార్టీ ప్రమాద బీమా పథకం కింద వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందజేయనున్నట్లు చెప్పారు.ప్రతి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుగా రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందజేశామని తెలిపారు.
ప్రైవేటు దేవాలయాలపై ప్రభుత్వం పర్యవేక్షణ
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన దేవాలయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు.
“దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న, అలాగే ప్రైవేటుగా నిర్మించబడిన దేవాలయాల్లో భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాలు, క్రౌడ్ మానిటరింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేయాలని సీఎం గారు కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు,” అని చెప్పారు.దేవాలయాల నిర్వహణకు సంబంధించిన నియమాలు, భద్రతా ప్రమాణాలను నిర్ధారించేందుకు ఎస్‌ఓపీ (Standard Operating Procedure) రూపొందించమని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
94 ఏళ్ల భక్తుని భక్తి ఫలితం – కానీ దురదృష్టవశాత్తూ విషాదం
ఈ దేవాలయాన్ని నిర్మించిన 94 ఏళ్ల పాండా గారు సొంత ఖర్చుతో 12 ఎకరాల భూమిలో రూ.15 నుంచి రూ.20 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని నిర్మించారని లోకేష్ తెలిపారు. “ఆయన లక్ష్యం ప్రజలకు భగవంతుని దగ్గర చేయడం. కానీ అనుకోకుండా జరిగిన ఈ ఘటన అందరినీ తీవ్ర విషాదంలో ముంచేసింది,” అని అన్నారు.దేవాలయ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి భవిష్యత్ కార్యాచరణను ప్రభుత్వం నిర్ణయించనున్నట్లు తెలిపారు.
పులిపాటి పాపారావు | జర్నలిస్ట్
#కాశీబుగ్గఆలయం #Palasa #Srikakulam #NaraLokesh #Y7NewsTelugu #TempleStampede #BhaktaVishadam









