E-PAPER

పాతికేళ్లకే బట్టతల..? మీ శరీరంలో దాగున్న అసలు సమస్యలు ఇవే..!

ఒకప్పుడు జుట్టు రాలడం, బట్టతల సమస్యలు నడివయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. కానీ నేడు ఇరవైలు, ముప్ఫైల్లోనే తలపైన జుట్టు పల్చబడిపోవడం, బట్టతల లక్షణాలు కనిపించడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా పెళ్లిళ్లకు సిద్ధమయ్యే యువతీయువకుల్లో ఈ ఆందోళన మరింత పెరిగిపోతోంది. కేవలం వయసు పెరగడం వల్లే కాకుండా జీవనశైలి, శరీరంలోని అంతర్గత సమస్యల కలయిక వల్లే చిన్న వయసులోనే జుట్టు ఊడిపోయి బట్టతల దిశగా దారితీస్తోందని డెర్మటాలజిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు.

చిన్న వయసులోనే జుట్టు రాలడానికి కారణాలు
ఆహారంలో పోషకాల లోపం, హార్మోన్ల అసమతుల్యత, తరచూ హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం జుట్టు తీవ్రంగా రాలడానికి ప్రధాన కారణాలు. వివాహ సన్నాహాల సమయంలో ఒత్తిడి తారస్థాయికి చేరడం వల్ల ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. వీటితో పాటు వంశపారపర్యంగా వచ్చే జన్యుపరమైన అంశాలు, నిరంతరం ఎదురయ్యే వాయు కాలుష్యం, జుట్టు తత్వానికి సరిపడని రసాయన ఆధారిత ఉత్పత్తుల వాడకం వల్ల చిన్న వయసులోనే కుదుళ్లు బలహీనపడతాయి.

శరీరంలో అసలేం జరుగుతుంది?
జుట్టు రాలడం మొదలవగానే సొంత చిట్కాలతో కాలయాపన చేయొద్దు. ముందుగా నిపుణులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో ఐరన్, ఫెర్రిటిన్, విటమిన్ బి12, విటమిన్ డి3 వంటి కీలక పోషకాల స్థాయులు ఎలా ఉన్నాయో? తెలుసుకోవాలి. అలాగే హార్మోన్ల అసమతుల్యత కూడా బట్టతలకు ప్రధాన కారణమవుతుంది. స్త్రీలలో పురుష హార్మోన్లు పెరగడం, పురుషుల్లో ప్రొలాక్టిన్ లేదా స్త్రీ హార్మోన్లు పెరగడం, ఇద్దరిలోనూ థైరాయిడ్ సమస్యలు తలెత్తడం వల్ల కుదుళ్లు దెబ్బతింటాయి. వీటితో పాటు శరీరంలో అంతర్గత వాపును సూచించే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను కూడా పరిశీలించి, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాలి.

కుదుళ్లను కాపాడుకోవడానికి ఏం చేయాలి?
స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తలలో రక్తప్రసరణను మెరుగుపరచడం వల్ల పోషకాలు నేరుగా జుట్టు కుదుళ్లకు అందుతాయని డాక్టర్ శెట్టి వివరిస్తున్నారు. ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడం, తలకు తేలికపాటి మైల్డ్ షాంపూలను మాత్రమే వాడటం అలవాటు చేసుకోవాలి. కుదుళ్లకు నూనె పెట్టి నెమ్మదిగా మర్దనా చేయడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అడ్డుకోవచ్చు. జుట్టును దెబ్బతీసే కఠినమైన రసాయన ఉత్పత్తులు, అధిక ఉష్ణోగ్రతతో చేసే హెయిర్ ట్రీట్‌మెంట్లకు ఎంత దూరంగా ఉంటే కుదుళ్లు అంత ఆరోగ్యంగా ఉంటాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!